Hot Widget

Ticker

6/recent/ticker-posts

AP TET Special - TELUGU - అలంకారాలు

AP TET Special - TELUGU -  అలంకారాలు

 అలంకారాలు

అలంకారం : చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.

అలంకారాలు రెండు రకాలు :

అ) శబ్దాలంకారాలు

ఆ) అర్థాలంకారాలు

అ) శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు”.

కింది గేయాన్ని గమనించండి. “అది గదిగో మేడ

మేడకున్నది గోడ

గోడ పక్కని నీడ

నీడలో కోడె దూడ

దూడ వేసింది పేడ

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం వినసొంపు, ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

1) అంత్యానుప్రాసాలంకారం :

ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు, వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.

ఉదా :

1) భాగవతమున భక్తి

భారతమున యుక్తి రామకథయే రక్తి

ఓ కూనలమ్మ”

గమనిక :

పై కవితలో ప్రతివాక్యం చివర ‘కీ’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

2) ‘గుండెలో శూలమ్ము గొంతులో శల్యమ్ము పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతిపాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

1. అంత్యాను ప్రాసాలంకారం : (లక్షణం) :

పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని ‘అంత్యానుప్రాసాలంకారం’ అంటారు.

కింది గేయాలు గమనించండి :

1) “వేదశాఖలు వెలసె నిచ్చట

ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :

ఈ గేయంలోని మొదటి పంక్తి చివర, ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ, ఉంది. కాబట్టి అంత్యానుప్రాసాలంకారం దీనిలో ఉంది. ‘తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2. వృత్త్యను ప్రాసాలంకారం :

అక్షరం అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే, మళ్ళీ మళ్ళీ రావడం.

ఉదా :

నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా ? నీవు నన్నే మన్నా అన్నావా?

గమనిక :

పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం.

అభ్యాసము :

1) కా కి కో కి ల కాదు కదా !

2) లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది.

గమనిక :

మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ‘వృత్త్యనుప్రాసాలంకారం.

ఈ కింది వాక్యాలు చూడండి.

1) ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది.

2) చిట పట చినుకులు ట ప ట ప మని పడుతున్నవేళ

గమనిక :

మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి. ఈ ఉదాహరణలు కూడా చూడండి.

అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు

ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.

ఇ) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా.

గమనిక :

ఈ విధంగా ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే,

దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

 

3. ఛేకాను ప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.

ఉదా :

“నీకు వంద వందనాలు”.

పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరుసంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’, వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకాను ప్రాస (లక్షణం) :

హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే వస్తే, దానిని ‘ఛేకానుప్రాస అలంకారం అంటారు.

ఛేకానుప్రాసకు మరికొన్ని ఉదాహరణములు :

1) పాప సంహరుడు హరుడు

అర్థాలంకారాలు :

1. ఉపమాలంకారం :

1) ఆమె ముఖం అందంగా ఉంది.

2) ఆమె ముఖం, చంద్రబింబంలాగ అందంగా ఉన్నది.

గమనిక :

పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది. అనే వాక్యం మనలను ఆకట్టుకుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి, అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.

ఉదా :

సోముడు భీముడివలె బలవంతుడు. గమనిక : ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.

1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)

2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)

3) బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం)

4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

* ఉపమాలంకారం (లక్షణం) :

ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారం’.

2. ఉత్ప్రేక్షాలంకారం : ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం, “ఉత్ప్రేక్షాలంకారం”.

ఉదా :

ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :

పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా, ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.

ఉదా :

1) ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి.

2) ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.

పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు

2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)

అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారము”.

 

3. రూపకాలంకారం (లక్షణం) :

ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే, రూపకాలంకారం అంటారు.

ఉదా :

‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో

1) ‘మనస్సు’ – అనేది ఉపమేయం.

2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ, మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :

కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.

1) మా అన్న చేసే వంట నలభీమపాకం

2) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :

మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికి భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికీ భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.

1) లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు.

2) రుద్రమ్మ చండీశ్వరీ దేవి జల జలా పారించె శాత్రవుల రక్తమ్ము.

3) ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.

3) మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.

4) మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక :

పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

 

4. దృష్టాంతాలంకారం :

వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఒక భావం అర్థం గావటానికి మరో భావం అద్దంలో చూపించినట్లు ఉంటే దాన్ని ‘దృష్టాంతాలంకారం’ అంటారు.

ఉదా :

“ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతి మంతుడు”.

5. అతిశయోక్తి అలంకారం :

గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.

కింది వాక్యాన్ని గమనించండి.

ఉదా :

ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాము.

5. అతిశయోక్తి అలంకారం : (లక్షణం) :

గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పటం.

6. స్వభావోక్తి అలంకారం :

ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని ‘స్వభావోక్తి’ అలంకారం అంటారు.

ఉదా :

జింకలు బిత్తరిచూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.

 

స్వభావోక్తికి మరియొక ఉదాహరణము :

1) ఆ లేళ్ళు బెదురుచూపులతో నిక్కపొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :

ఇక్కడ లేళ్ళ యొక్క సహజగుణాన్ని ఉన్నది, ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది ‘స్వభావోక్తి’ అలంకారము.

“మునుమును బుట్టె నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుట్టి యే

డెనిమిది నాళ్ళపాటి గలఁడింతియ, పూరియు మేయనేరడేఁ

జని, కడుపారఁ జన్లుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర

మ్మని సుకృతంబు గట్టికొనవన్న! దయాగుణ ముల్లసిల్లఁగన్”

గమనిక :

పై పద్యంలో గోవు యొక్క కొడుకు మొన్నమొన్ననే పుట్టాడని, ముద్దుముద్దుగా ఉంటాడని, ఏడెనిమిది రోజుల వయస్సు కలవాడని, కొద్దిగా కూడా గడ్డిని తినలేడని ఉన్నది ఉన్నట్లుగా చక్కని పదజాలంతో వర్ణించారు. కనుక ఇక్కడ ‘స్వభావోక్తి’ అలంకారం ఉంది.